AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. ఉరి బిగుసుకుని యువకుడు మృతి

ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ పిచ్చి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సరదాగా ఉరి వేసుకుని వీడియో చేయబోయే నిజంగానే ఉచ్చు బిగుసుకోవడంతో యువకుడు మృతిచెందాడు. వరంగల్‌ జిల్లా నర్సంపేటలో ఈ విషాదం చోటుచేసుకుంది.

వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్‌ (23) స్థానికంగా ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు. అతనికి మొబైల్‌లో రీల్స్‌ చేయడం అంటే పిచ్చి. ఈ క్రమంలోనే మంగళవారం హోటల్‌లో పని పూర్తి చేసుకున్న తర్వాత తన చిన్నక్క ఇంటికి వెళ్లాడు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లుగా రీల్‌ చేయాలని అనుకున్నాడు. ఇంట్లోని ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ను సెట్‌ చేసుకుని.. దూలానికి ఉరితాడు వేశాడు. అనంతరం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఉచ్చు బిగుసుకుని నిజంగా ఉరిపడింది.

ఉరి బిగుసుకోవడంతో ఊపిరాడక అజయ్‌ మరణించాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు అజయ్‌ ఉరివేసుకుని కనబడటం చూసి షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అజయ్‌ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని అజయ్‌ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10