కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి ఉందని, ఇది మనుగడ కొనసాగించడం కష్టమని కుండబద్దలు కొట్టారు. ఎన్డీఏ చాలా బలహీనంగా ఉందని, ఏ ఒక్క చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని బాంబ్ పేల్చారు. ఓ జాతీయ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎన్డీఏ కూటమిలో తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఆ కూటమిలోని కొందరు నేతలు మాతో టచ్‌లో ఉన్నారు. తన మనుగడ కోసం ఆ కూటమి ఇబ్బందిపడే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉంది. కాబట్టి.. ఏ చిన్న సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ ఉంది’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. కూటమిలో ఎవరైనా ఒకరు యూ-టర్న్ తీసుకున్నా.. అది ప్రభుత్వాన్ని ప్రమాదంలో పడేయడం పక్కా అనే అభిప్రాయాన్ని ఆయన పంచుకున్నారు. బీజేపీ తన విద్వేషపు ఆలోచనల్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నించిందని, కానీ ప్రజలు దాన్ని తిరస్కరించారని అన్నారు. 2014, 2019లో పని చేసిన మోదీ మంత్రం ఈసారి పని చేయలేదని రాహుల్ ఉద్ఘాటించారు.
కాగా.. గత రెండు ఎన్నికల్లో స్వయంగా మెజారిటీ మార్కును (272) దాటిన బీజేపీ, ఈసారి మాత్రం 240 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇండియా కూటమి నుంచి గట్టి పోటీ నెలకొనడంతో.. మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. మిత్రపక్షాల సంపూర్ణ మద్దతుతో ఎన్డీఏ (293) కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇలా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకే.. ఎన్డీఏ ఎప్పుడైనా కూలిపోవచ్చని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఆయనతో పాటు ఇండియా కూటమిలోని ఇతర ప్రధాన నేతలూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు.









