అమరావతి: ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియల్లో అభివృద్ధి చెందిన దాదాపు అన్ని ప్రజాస్వామ్య దేశాలు పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నాయని, ఈవీఎంలను వాడడం లేదని జగన్ అన్నారు. ‘మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని చాటిచెబుతూ మనం కూడా పేపర్ బ్యాలెట్స్ దిశగా అడుగులు వేయాలి’ అని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. కాగా జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగానే టీడీపీ, జనసేన కౌంటర్ ఇచ్చాయి.
‘‘ జరిగిన న్యాయం కనిపించాలని ఏవిధంగానైతే కోరుకుంటామో.. అలాగే ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండటమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా కనిపించాలి’’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
జగన్ వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా టీడీపీ కౌంటర్ ఇచ్చింది. 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు అద్భుతంగా పనిచేశాయని చెప్పి.. 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనడం అస్సలు బాలేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.









