నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో కేటీఆర్ కోరారు.
విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని, కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని ఆయన తెలిపారు.
కష్టపడి చదివే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని కేటీఆర్ విమర్శించారు. ఓవైపు బీహార్‌లో రూ.30 లక్షల చొప్పున నీట్ ప్రశ్నాపత్రాలు విక్రయించారని పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలొస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. మొదట్నుంచి నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు.









