ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటితో దేశవ్యాప్తంగా ఏడు దశల్లో అన్ని స్థానాలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని తేల్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ ఎగ్జిట్ పోల్స్‌పై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. అవన్నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫాంటసీ పోల్స్ అంటూ సెటైర్లు వేశారు. ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఈ కామెంట్స్ చేశారు. ఇది వారి ఫాంటసీ పోల్ అని ఆరోపించారు. చాలా స్థానాల్లో పోటీ ఎక్కువగా ఉందని, ఫలితాలు వచ్చాక అంతా తేలిపోతుందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్‌ను ఆయన పూర్తిగా తిరస్కరించారు. ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ సిద్ధూ మూసే వాలా పాటను గుర్తు చేశారు. ఈ పాట మీరు విన్నట్లయితే అప్పుడు అర్థం చేసుకోండని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు.









