భానిసత్వాన్ని తరిమికొట్టినం..
సంక్షేమం ముసుగులో చెరబట్టాలని చూస్తే సహించం
తెలంగాణది తిరగబడే నైజం..
4 కోట్ల ప్రజల ఉప్పొంగే పర్వదినం ఇది..
(అమ్మన్యూస్, హైదరాబాద్):
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం.. రాష్ట్ర అవతరణ దినమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తయిందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్.. పతాకావిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ, స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజాణే కానీ.. అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనకు ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే తెలంగాణ భరించదు’ అని అన్నారు.
నిజమైన ప్రజా పాలన..
2023, డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు మొదటి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం అన్నారు. పాలకులు, పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టామన్నారు. ‘మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రజలకు అందుబాటులో ఉండే పాలన తెచ్చాం. మేం సేవకులం తప్ప పాలకులం కాదన్న నిజాన్ని నిరూపించాం. ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజల సమస్య నేరుగా విని, పరిష్కరిస్తున్నాం. ఇందిరాపార్కులో ధర్నాచౌక్‌కు అనుమతి ఇచ్చాం. మీడియాకు స్వేచ్ఛను ఇచ్చాం. ప్రతిపక్షానికి గౌరవం ఇచ్చాం. మా నిర్ణయాల్లో లోటుపాట్ల సమీక్షకు అవకాశం ఇస్తున్నాం. ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు ఇవ్వాలన్నది మా ప్రభుత్వ ప్రాధాన్యత’ అని అన్నారు.
అమరుల ఆశయాలు సాధించిన నాడే ..
2014, జూన్ 2న తెలంగాణ భౌగోళిక ఆకాంక్ష నెరవేరింది. అంతటితో మనం లక్ష్యాన్ని చేరినట్టు కాదు. ఉద్యమ లక్ష్యాలు, అమరుల ఆశయాలు సాధించిన నాడే తెలంగాణ సాధనకు సార్థకత వస్తుందని సీఎం అన్నారు. దశాబ్ద కాలం అన్నది ఒక మైలురాయి. ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చడంలో మనం ఎక్కడ ఉన్నాం అన్నది సమీక్షించుకోవాల్సిన సందర్భం ఈ దశాబ్ది ఉత్సవం అని అన్నారు. ఈ సంస్కృతికి, చరిత్రకు పునరుజ్జీవనం జరగాలి. ప్రజల ఆకాంక్షల మేరకు ఈ పర్వదినాన ‘జయ జయహే తెలంగాణ..’ గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా సగర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి తొలి అడుగు అని సీఎం అన్నారు.
చరిత్రకు ‘చిహ్నం’..
చిహ్నం ఒక జాతి చరిత్రకు అద్దంపడుతుందని సీఎం రేవంత్ తెలిపారు. జాతి చరిత్ర మొత్తం నిక్షిప్తమై ఉండేది చిహ్నంలో మాత్రమేనని రేవంత్ అన్నారు. తెలంగాణ అంటే ధిక్కారం, పోరాటం. రాష్ట్ర అధికారిక చిహ్నంలో అది ప్రతిబింబించాలి, ఆ దిశగా ప్రజా ప్రభుత్వం నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉందన్నారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుని నూతన చిహ్నాన్ని రూపొందించే పనిలో ఉన్నామన్నారు.
గ్రీన్ తెలంగాణ..
స్వల్పకాలిక ఆలోచనలు కాదుం దీర్ఘ కాలిక ప్రణాళికలతో భవిష్యత్ కు పునాదులు వేస్తున్నాం. మొత్తం తెలంగాణకు ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’ తయారు చేస్తున్నాం. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తున్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రాంతం అర్బన్ తెలంగాణ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతం సబ్ అర్బన్ తెలంగాణ, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్నది గ్రామీణ తెలంగాణగా నిర్ధారించాం. మూడు జోన్లలో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరగాలి.. ఎక్కడ ఏ రకమైన మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నది ఈ మెగా ప్రణాళికలో విస్పష్టంగా ప్రకటిస్తాం’ అని రేవంత్ అన్నారు.
మూసీ సుందరీకరణ..
మూసీ సుందరీకరణ పథకం ద్వారా పరీవాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్‌గా తీర్చిదిద్దబోతున్నాం. దీని కోసం ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు.
డ్రగ్స్ పై ఉక్కు పాదం
‘తెలంగాణలో డ్రగ్స్ అన్న మాట వినిపించడానికి వీలు లేదని మేం సంకల్పం తీసుకున్నాం. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. టీ న్యాబ్ కు పూర్తి సహకారం, స్వేచ్ఛ ఇస్తున్నాం. అవసరమైన నిధులు ఇస్తున్నాం. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారు ఉన్నా వదిలే సమస్యే లేదు’ అని సీఎం అన్నారు.
యువతకు ఉద్యోగాలు..
‘యువత ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ పారదర్శకంగా నిర్వహించడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. 70 రోజుల్లోనే 30 వేల మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ నెల తొమ్మిదిన ప్రాథమిక పరీక్ష జరగబోతోంది. 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చాం. వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచాం. ప్రభుత్వంలో ఖాళీలను భర్తీ చేస్తాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.
రైతును రాజును చేయడం సంకల్పం..
రైతు బాగుంటే రాష్ట్రం పచ్చగా ఉంటుందని విశ్వసించే ప్రభుత్వం మాది అని సీఎం రేవంత్ అన్నారు. ‘గతంలో రైతుకు ఉచిత విద్యుత్, రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఆ ట్రాక్ రికార్డును ప్రజా ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతుకు ఆర్థిక సాయం పథకంలో భాగంగా 69 లక్షల మందికి చెప్పిన మాట ప్రకారం రూ.7,500 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ఇటీవల అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు 10 వేల రూపాయలు పరిహారం ఇచ్చాం. ధాన్యం సేకరణ కోసం 7,245 కేంద్రాలు తెరిచాం. ఎలాంటి షరతులు లేకుండా తడిసిన ధాన్యం కొంటున్నాం. తరుగు విషయంలో రైతు నష్టపోకుండా చూస్తున్నాం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాం. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. ధరణి పోర్టల్‌పై స్పెషల్ డ్రైవ్ పెట్టి సమస్యలు పరిష్కరిస్తున్నాం’ అని సీఎం వివరించారు.
దిక్సూచి కావాలి..
తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలి. తెలంగాణ విజయ పతాక దేశ విదేశాలలో సగర్వంగా ఎగరాలి అని అన్నారు. తెలంగాణను ప్రపంచానికి డెస్టినేషన్‌గా మార్చాలన్న తపన ఉంది. దీనికి నాలుగు కోట్ల ప్రజల ఆశీస్సులతో పాటుం రాజకీయ, పరిపాలన, పత్రికా, న్యాయ, సామాజిక వ్యవస్థల సహకరం కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు, ప్రతి క్షణం ఆలోచన చేయాలని, ప్రజా ప్రభుత్వానికి మీ సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటూ.. అందరికీ మరొక్కసారి తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.









