AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీకి చంద్రబాబు-పవన్ కల్యాణ్..! ఎన్డీయే ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశానిర్ధేశం..

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లనున్నారు. వరుసగా షెడ్యూల్ ఉండడంతో ఇరువురు నేతలు రెండు రోజులు అక్కడే మకాం వేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి ఇరువురు నేతలు హాజరవుతున్నారు. అలాగే గురువారం నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వెళ్తున్నారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు భారత్ మండపంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి హాజరవుతున్నారు.

 

2029 ఎన్నికలకు సంబంధించి అంచెలంచెలుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? దీనికితోడు సోమవారం ‘ఇండియా కూటమి’లోని డీఎంకె తప్పితే అన్ని పార్టీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్డీయే నేతల భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ మేరకు అమలు అయ్యాయి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? అనే దానిపై నేతలు చర్చించనున్నారు.

 

ఫ్యూచర్ ప్లాన్‌పై పార్టీలకు దిశా నిర్ధేశం, మహిళా రిజర్వేషన్, డీ లిమిటేషన్ బిల్లులపై చర్చ?

 

ఈ సమావేశంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించే అవకాశమున్నట్లు ఢిల్లీ పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, డీ లిమిటేషన్ బిల్లులు తేవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బెంగాల్‌లో టీఎంసీ పార్టీ రెండు ముక్కలు అయ్యింది. ఓ వర్గం నేతలు బీజేపీకి మద్దతు పలికేందుకు రెడీ అయ్యారు.

 

ఇక తమిళనాడులోని టీవీకే పార్టీతో కాంగ్రెస్ జత కట్టడంతో సోమవారం ఇండియా కూటమి సమావేశానికి డీఎంకె హాజరు కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే మునుపటి కంటే చట్ట సభల్లో ఇండియా కూటమి మద్దతు తగ్గవచ్చని కమలనాథులు ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ రెండు బిల్లులు తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం సాగుతోంది.

 

ఈ లెక్కన బుధవారం జరగనున్న ఎన్డీయే భేటీ కీలకంగా మారింది. గురువారం రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. దీనికి సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రికి అమరావతి చేరుకుంటారు సీఎం చంద్రబాబు.

ANN TOP 10