నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు సీపీఐ, సీపీఎం, టీజేఎస్ మూడు పార్టీల మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనమానేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీ లు పూర్తిగా కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నాయని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
*ప్రజాస్వామ్యం బ్రతకాలంటే మల్లన్న గెలువాలి: ఎమ్మెల్యే కూనంనేని*
ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలని సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచామని జనసమితి పార్టీ చీఫ్ ఫ్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసామని తెలిపారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ను గెలిపించాలని కోరుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు ప్రొఫెసర్ కొదండరాం పిలుపినిచ్చారు.