ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. అలాగే వచ్చే నెల (జూన్) 4 ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే కనిపిస్తుండగా, బీజేపీ మాత్రం ఉనికిని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. నేటితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారం ముగియడంతో చివరి సారిగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు రంగంలోకి దిగారు. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేయగా.. మొత్తం 4,61,806 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లు 1,74,794 మంది, పురుషులు 2,87,007 మంది, ట్రాన్స్జెండర్లు ఐదుగురు ఉన్నారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం పట్టభద్రుల ఓటర్ల సంఖ్య నల్లగొండ జిల్లాలో 1,65,778 మంది, ఖమ్మం జిల్లాలో 1,23,504 మంది, వరంగల్ జిల్లాలో 1,67,853 మంది, సిద్దిపేట జిల్లాలో 4,671 మంది ఉన్నారు.
*బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ*
ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలో ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రాజేశ్వర్రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన తమ స్థానాన్ని దక్కించుకునందుకు బీఆర్ఎస్ శాయశక్తుల పోరాడుతోంది. దీన్ని కైవసం చేసుకొని పట్టభద్రుల్లో కూడా తమకే పట్టు ఉందని నిరూపించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ సీటు దక్కించుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెక్ పెట్టవచ్చనే ఆలోచన బీజేపీ ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన పార్టీలు బరిలోకి దింపాయి. మొత్తంగా బరిలో 52 మంది అభ్యర్థులు ఉండగా, స్వతంత్ర అభ్యర్థుల బక్క జడ్సన్, పాలకూరి అశోక్ కుమార్ పోటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూనే.. ఆ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ ప్రచారం చేస్తోంది. ఈ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రచారాన్ని నడిపించింది.
*మద్యం షాప్లు బంద్*
సోమవారం రోజు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మద్యం షాప్లు మూసివేశారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి మే 27 సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు మూసివేయనున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేటి సాయంత్రం నుంచి మూడు నియోజకవర్గాల పరిధిలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. అదే విధంగా ఉమ్మడి మూడు జిల్లాల్లో ఓటు వేసే పట్టభద్రుల ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ఇవ్వాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచార గడువు ముగియడంతో బల్క్ ఎస్ఎంఎస్లు, రాజకీయ ప్రకటనలు బంద్ కానున్నాయి.