మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకు కేసీఆర్ ఆలోచనతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని అన్నారు. ఆ దిశగా వేగంగా అడుగులు వేసిందన్నారు. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేనిపోని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ఆస్పత్రులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే ఆలోచన పక్కనపెట్టి రాజకీయాలు చేస్తుందని, టిమ్స్ ఆసుపత్రుల మంత్రి కోమటిరెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటం దురదృష్టకరమన్నారు.
టిమ్స్ ఎల్బీనగర్ ఆస్పత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడుతున్నారని, ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్నారని, జైపూర్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆస్పత్రి ఎందుకు కనిపించడం లేదు.? అని మండిపడ్డారు. నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలని, అంతేగాని చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని హరీష్ రావు వ్యాఖ్యానించారు.