AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మేడిగడ్డ మరమ్మతులకు ఒప్పుకున్న ఎల్ అండ్ టీ.. సొంత ఖర్చుతోనే రిపేర్..

కాళేశ్వర్ ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన డ్యామేజీని చక్కదిద్దేందుకు ఎట్టకేలకు ఎల్ అండ్ టీ కంపెనీ ఒప్పుకుంది. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కంపెనీ తరఫున హాజరైన ప్రతినిధులు అనేక విషయాలను చర్చించారు. కంపెనీ తన సొంత ఖర్చుతోనే బ్యారేజీకి రిపేర్ పనులు చేసేందుకు ఒప్పుకోవటం గమనార్హం. ఏయే పనులు చేయాలనే అంశంపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తన మధ్యంతర నివేదికలో స్పష్టత ఇచ్చింది. వాటికి అనుగుణంగా ఎల్ అండ్ టీ కంపెనీ ఈ పనులను టేకప్ చేయనుంది. రాబోయే వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని పనులకు ఆటంకం లేకుండా అప్పటివరకు పూర్తయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పనులను మొదలుపెడితేనే సాధ్యమని వివరించారు. దీంతో శుక్రవారం నుంచే పనులు మొదలుకానున్నాయి.

మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు కూడా ఒకే తరహాలో ఉన్నాయని పేర్కొన్న ఎన్డీఎస్ఏ, ఆ రెండింటిలోనూ కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయని తన ఇంటెరిమ్ రిపోర్టులో వ్యాఖ్యానించింది. నీటి బుంగలు ఏర్పడడంతో పాటు బ్యారేజీ పిల్లర్ల బేస్‌మెంట్ కింద ఇసుక తొలగిపోయిందని కూడా కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది. వీటన్నింటి కారణంగా మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరాదని, వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేయాలని, మొత్తం గేట్లను పూర్తిగా పైకి ఎత్తి ఉంచాలని సిఫారసు చేసింది. పిల్లర్లకు పగుళ్లు రావడం, భూమిలోకి కుంగిపోయిన నేపథ్యంలో వెంటనే చేపట్టాల్సిన పనులపైనా టెక్నికల్ అంశాలను ప్రస్తావించి సూచనలు చేసింది. పిల్లర్లకు పగుళ్లు వచ్చి కుంగిన చోట గేట్లను ఎత్తడానికి వీలు పడకపోతే వాటిని పూర్తిగా తొలగించి కొత్తవాటిని అమర్చాలని కూడా క్లారిటీ ఇచ్చింది.

ANN TOP 10