సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు భారీగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ఇబ్బంది తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు, తెలంగాణలోని జిల్లాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటి వరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో 140 సర్వీసులను ఆన్ లైన్ లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగిందని, ఆయా బస్సుల్లో దాదాపు 3వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని సజ్జనార్ తెలిపారు.
విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు. అలాగే, హైదరాబాద్ నుంచి జిల్లాలకు 1500 ప్రత్యేక బస్సులను సంస్థ పడుతోందని చెప్పారు. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులను ఆర్టీసీ తిప్పుతోంది. ప్రయాణీకుల రద్దీని బట్టి ఎప్పటికప్పుడు బస్సులను అందుబాటులో ఉంచాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా సొంతూళ్లకు వెళ్లి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు.









