ఢిల్లీ మద్యం కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈ కేసులో అరెస్టైన ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. జూన్ 1 వరకూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ట్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం తీర్పు వెల్లడించింది. జూన్ 1 వరకు ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2న లొంగిపోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. కోర్టు కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత కస్టడీ పొడిగించారు. ఈ నేపథ్యంలోనే తన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన మద్యంతర బెయిల్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
దర్యాప్తు సంస్థల సమన్లుపై నో రియాక్షన్!
అంతకుముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేసింది. వాటికి స్పందించకపోవడం వల్ల అదుపులోకి తీసుకుంది. మధ్యంతర బెయిల్ పై సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు జరిగాయి. ఇది అసాధారణ పరిస్థితి అని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అని, తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని జడ్జి వాదించారు. లోక్‌సభ ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని, ఆప్ అధినేతగా కేజ్రీవాల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం కేజ్రీవాల్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈడీ, కేజ్రీవాల్ తరఫు లాయర్ల వాదనలు విన్న కోర్టు బెయిల్‌పై తీర్పును రిజర్వ్ చేయగా.. నేడు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఆయనకు మధ్యంతర బెయిల్ రావడం ఆమ్ ఆద్మీ పార్టీకి, సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరటగానే చెప్పవచ్చు.