ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశ ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును కోర్టు వాయిదా వేసింది. ఈడీ, సీబీఐ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ బెయిల్ పిటిషన్లపై ఈ నెల 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కవిత బెయిల్ పిటిషన్లపై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరగ్గా.. తీర్పును మే 2 (గురువారం)కు రిజర్వ్ చేసింది. ఇవాళ విచారణ సందర్భంగా మే 6వ తేదీకి తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని చెప్పారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని కోర్టుకు సీబీఐ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేయగా.. రిమాండ్లో ఉండగానే ఏప్రిల్ 11న సీబీఐ ఆమెను అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు.









