మహబూబాబాద్ : తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వను అని హామీ ఇస్తున్నా అని కేసీఆర్ తేల్చిచెప్పారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మహబూబాబాద్‌లో కేసీఆర్ ప్రసంగించారు.
ఈ దేశంలో నరేంద్ర మోదీ ఏమన్న పని చేసిండా..? అంటే ఏం లేదు. రూ. 15 లక్షలు ఇస్తామన్నాడు.. వచ్చాయా…? బేటీ పడావో బేటీ బచావో, అమృత్ కాల్, మన్ను కాల్.. మషానం కాల్ అన్ని నినాదలే తప్ప ఏ ఒక్క పని జరగలేదు. నరేంద్ర మోదీ గోదావరిని ఎత్తుకుని పోతా అంటే సీఎం నోరు మూసుకుని ఉన్నాడు. ఇప్పటికే కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పజెప్పారు. ఇవాళ ఖమ్మం పట్ణంలో మురికి నీళ్లు వస్తున్నాయి. మహబూబాబాద్ నియోజకవర్గంలో డోర్నకల్, నర్సంపేటలో భయంకరంగా మంచినీళ్ల సమస్య వస్తుంది. ఎనిమిదేండ్ల పాటు మంచిగా ఉన్న కరెంట్ ఎక్కడ..? భగీరథ ఎక్కడ పోయిందని ఆలోచించాలి. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదు. కానీ బీఆర్ఎస్ హయాంలో బంజారా భవన్, సేవాలాల్ భవన్ కట్టుకున్నాం. పది శాతం రిజర్వేషన్లు పెట్టుకున్నాం. గిరిజన తండాలన్నీ జీపీలు చేశాం. కాబట్టి గిరిజన బిడ్డలు మీ యొక్క ప్రతాపం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలి అని కేసీఆర్ కోరారు.









