(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం నడుస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగతో కలిసి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మాదిగలపై రేవంత్ రెడ్డి సర్జికల్ స్టైక్ చేశారని, ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఒకే కులానికే 9 సీట్లు ఇచ్చారని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. తమ ఓటు ఎంత శక్తివంతమైందో లోక్‌సభ ఎన్నికల్లో చూపిస్తామని హెచ్చరించారు.
‘మాదిగలు, బీసీలు పార్లమెంట్‌కు పోవద్దా, రెడ్లు మాత్రమే పార్లమెంట్‌కు వెళ్లాలా? కేసీఆర్ అంటే ఒక్కే కుటుంబంలోని వారికి అధికారం ఇస్తే.. కాంగ్రెస్‌లో మాత్రం మీరు కుటుంబాలు.. కుటుంబాలుగా అధికారం పంచుకుంటున్నారు, దోచుకుతింటున్నారు. పార్లమెంట్‌లో మాదిగల గొంతు వద్దా? రేపు ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులోకి వస్తే దానిపై మాట్లాడే వారు వద్దా? మాదిగలను రాజకీయాలకు బలి చేసే కుట్ర జరుగుతోంది. దేశంలో జరిగిన సర్జికల్ స్టైక్ గురించి మాకు తెలియదు.. కానీ తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి మాదిగలపై సర్జికల్ స్టైక్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల దమ్ము ఏంటో చూపిస్తాం’ అని మోత్కుపల్లి అన్నారు. రేవంత్ రెడ్డి.. మాదిగలను పక్కకుపెట్టి కనీసం ఓటు బ్యాంకు లేని వారికి ఎంపీ సీట్లు కేటాయించారన్నారు. 4 నెలలకే మొత్తం మారిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందని చెప్పిన వ్యక్తిని నేను అని అన్నారు.
సీఎం వ్యాఖ్యలు అర్థరహితం..
‘కడియం శ్రీహరి.. మాదిగలు, మాలలు నోటి కాడి ముద్ద లాక్కుంటుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు. ఇప్పుడు ఆయనే గొప్ప అన్ని రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారు? కడియం శ్రీహరి గురించి గతంలో కేసీఆర్‌కు చెప్పినా వినలేదు.. ఇప్పుడు ఆయనకూ తెలిసొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఒక్క ఇంట్లో రెండు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు.. ఇదెక్కడి న్యాయం? ఒక ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారా? పెద్దపల్లి ఎమ్మెల్యే వివేక్‌కు అధికార దాహం తీరడం లేదు. ఒక్కొక్కరు రెండు, మూడు సీట్లు పంచుకోవచ్చా? నేను కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నాను.. కాంగ్రెస్ పార్టీ లోనే ఉంటా. రాష్ట్రంలో రెడ్డిల రాజ్యం నడుస్తుంది. బీసీలకు కూడా అన్యాయం చేశారు.. ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చార’ని మోత్కుపల్లి అన్నారు.









