వరంగల్‌కు ఓఆర్‌ఆర్, ఎయిర్‌పోర్టు.. రెండో రాజధాని మాదిరి..
కాళేశ్వరంపై చర్చకు రావాలని, మేడిగడ్డవద్దే మేధావులతో చర్చిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం (ఏప్రిల్ 24) హన్మకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు వరంగల్ రెండో రాజధాని లాంటిదని అన్నారు. కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్య అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ప్రసంగించారు. కడియం కావ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కడియం శ్రీహరి దగ్గర కోట్ల రూపాయలను చూసి ఆయన కుమార్తె కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని.. కడియం నిజాయితీని చూసి ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్ నుంచి కొండా సురేఖ, సీతక్క రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలు ఎదిగారని.. మంత్రి పదవులు చేపట్టారని గుర్తుచేసిన రేవంత్ రెడ్డి.. మరో మహిళ కడియం కావ్యను కూడా అలాగే గెలిపించి ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. వరంగల్ ప్రజల గొంతుక అవుతారని చెప్పారు.
మోదీ, కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఢిల్లీలో మోదీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. ‘మామా, అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారు. అసెంబ్లీలో మా కళ్లలో చూసే ధైర్యం లేక కేసీఆర్ పారిపోయాడు. కేసీఆర్ చచ్చిన పాము. అసెంబ్లీకి రాడు. మాతో చర్చకు రమ్మంటే పారిపోతాడు. టీవీ ఛానల్ స్టూడియోలో మాత్రం 4 గంటలు కూర్చుంటాడు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
హరీష్ రావు రాజీనామా లేఖ సిద్ధం చేసుకో..
మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ పైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ‘రైతు రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తా అంటున్నాడె. ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. హరీష్ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలి. కేసీఆర్ మాదిరిగా హరీష్ రావు మాట తప్పొద్దు’ అని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవని విమర్శించారు.