హైదరాబాద్ : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన జీవితానుభవాలతో రాసిన పుస్తకాన్ని కౌటిల్య విద్యార్థుల సమక్షంలో ఆవిష్కరించారు. బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్, కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో డాక్టర్ దువ్వూరి సుబ్బారావు జస్ట్ ఏ మెర్సెనరీ.? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కేరీర్ పేరుతో ప్రచురించిన ఆంగ్ల పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సుబ్బారావు తన కెరీర్‌కు సంబంధించిన ఆకర్షణీయమైన, శ్రద్ధాశక్తులతో కూడిన కథనాన్ని అందించడమే కాకుండా, యువ నిపుణులకు వారి సొంత వృత్తిలో రాణించడానికి మార్గదర్శనం చేసేలా, యువతను ప్రేరేపించేలా రాసినట్టు వక్తలు వివరించారు.
వివిధ శాఖల్లో పలు హోదాల్లో పనిచేసిన అనుభవం నుంచి రాసిన పుస్తకాలు రేపటితరానికి ఉపయోగ పడతాయని తెలియజేశారు. కౌటిల్యా విజిటింగ్ ఫ్యాకల్టీ, ఇండిపెండెంట్, మల్టిమీడియా జర్నలిస్టు స్మితా శర్మ డాక్టర్ సుబ్బారావుతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ సయ్యద్ అక్బరుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.