లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. డబుల్ డిజిట్ సీట్లలో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో
ఇవాళ సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రోడ్‌షో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు. ఈ సారి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు.
2004, 2009లో సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ గెలిచిందని.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారాన్ని చేపట్టిందని గుర్తు చేశారు. ఈసారి సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమని.. మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ కాబోతుందని జోస్యం చెప్పారు. బీజేపీపై రేవంత్ ఫైర్ అయ్యారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మతాలపేరుతో చిచ్చుపెట్టి కేంద్రంలోని మోదీ సర్కార్ ఓట్లు దండుకుంటోందని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌రావుతో కలిసి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానం నాగేందర్ నామినేషన్ దాఖలుకు ముందు ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్‌లో నిర్వహించిన రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌పై నాకు గౌరవం ఉంది.. దానం నాగేందర్..
కాగా.. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బాట సర్కిల్, ప్యాట్నీ సెంటర్, మహబూబ్కాలేజీ మీదుగా ర్యాలీగా వెళ్లారు. ఆ తర్వాత సికింద్రాబాద్ జోనల్ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీతీరుపై మండిపడ్డారు దానం నాగేందర్.. ఫోన్ ట్యాపింగ్‌పై BRS తక్కువ మాట్లాడితే మంచిదన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీని గెలిపించేందుకు.. బీఆర్ఎస్ యత్నిస్తోందన్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకుందామని కేటీఆర్ తనతో అన్నారన్నారు. కేసీఆర్‌పై తనకు గౌరవం ఉంది.. కానీ బీఆర్ఎస్ది అయిపోయిన చరిత్ర.. రాహుల్‌ను ప్రధాని చేయడమే మా లక్ష్యం.. అంటూ దానం నాగేందర్ పేర్కొన్నారు.









