AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గులాబీ బాస్‌ టీవీల బాట.. రేవంత్‌ ఎఫెక్టా?

మీడియానే దగ్గరకు రానివ్వని ఆయన.. వారి వెంటపడటంపై సర్వత్రా చర్చ

(అమ్మన్యూస్‌, హైదరాబాద్‌):
ఓటమి గులాబీ బాస్‌లో గుబులు పెంచుతుందా?.. సీఎం రేవంత్‌ ఎఫెక్ట్‌తో దిగివచ్చిరా? అందుకే మీడియా బాట పడుతున్నారా? అవుననే అంటున్నారు పలువురు పరిశీలకులు. ఇక ఇప్పటి నుంచి టీవీ ఛానళ్ల ఆఫీసులచుట్టూ తిరగనున్నట్లు పార్టీ ముఖ్య నేతలు సైతం చెబుతున్నారు. పేదళ్లకు కష్టం వచ్చినా.. విపత్తులతో విలవిల్లాడినా.. దగ్గరకు వచ్చి సాంత్వన కలిగించే మాటను చెప్పింది లేదన్నది అందరికీ తెలిసిందే. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. పదేళ్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినా ఏ రోజు ప్రజల ముంగిటకు వచ్చి.. తన పాలనా లోపాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నది నగ్నసత్యం.

తన మనుషులు.. తన ప్రపంచాన్ని వేరుగా చేసుకున్న ఆయన.. అందులోనే మునిగి తేలేవారు. మంత్రులు మొదలు సామాన్యుల వరకు ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. సీనియర్‌ ఐఏఎస్‌.. ఐపీఎస్‌ అధికారులు గంటల కొద్దీ సమయం వెయిట్‌ చేయాల్సి వచ్చేది. తన తప్పొప్పులను ఎత్తి చూపే మీడియాను అస్సలు పట్టించుకోకపోవటమే కాదు.. వారికి ఎలాంటి సమాచారం అందకుండా కట్టడి చేసిన రోజుల్ని మర్చిపోలేం. అంతేనా.. ప్రభుత్వం జారీ చేసే జీవోల్ని సైతం బయటకు రాకుండా.. రహస్యంగా ఉంచేసిన వైనం తెలిసిందే.

హక్కుల కోసం ఉద్యమించిన ఒక ఉద్యమ నేత పాలనలో.. ప్రభుత్వం చేసే పనులన్ని పారదర్శకంగా చూపించాల్సింది పోయి.. రహస్యంగా ఉంచేసిన వైనం విస్మయానికి గురి చేసింది. ప్రతిది గుట్టుచప్పుడు కాకుండా చూసుకోవటం.. పల్లెత్తు విమర్శకు తావివ్వకపోవటం లాంటివెన్నో పదేళ్ల కేసీఆర్‌ పాలనతో చూసిందే. ఎప్పుడో తనకు నచ్చినప్పుడు మాత్రమే శాఖల పరంగా రివ్యూలు చేయటం.. ఫైళ్లను క్లియర్‌ చేయటం మొదలు ప్రజలు తమ గోడు చెప్పుకోవటానికి వీల్లేని రీతిలో అందరికి దూరంగా ఉండిపోయిన ఆయన.. పాలనను అస్తవ్యస్తంగా మార్చేశారన్న ఆరోపణలెన్నో.

అన్నింటికి మించి కేసీఆర్‌ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన విచిత్రమైన మనస్తత్వాన్ని ప్రదర్శించేవారు. ఎవరు అవునన్నా.. కాదన్నా కేసీఆర్‌ ఇంతటి నాయకుడు అయ్యాడంటే అది మీడియా.. మీడియా ప్రతినిధుల పుణ్యమే. అది కాదనలేని సత్యం. ఉద్యమనేతగా ఉన్నప్పుడు నిత్యం మీడియా ప్రతినిధులకు అందుబాటులో ఉంటూ.. ఉద్యమాన్ని వేడెక్కించేందుకు.. ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చేందుకు గంటల కొద్దీ సమయాన్ని గడిపిన ఆయన.. అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన కొందరిని అందలానికి ఎక్కించేసి.. మొత్తం మీడియా వ్యవస్థను ఎంతలా తూలనాడారో ప్రతి వ్యక్తికి తెలుసు.

అంతేకాదు.. మీడియాకు అందుబాటులోకి రాకుండా ఉండటం.. తనకు నచ్చిన ఆదివారాల్లోనో.. రాత్రి వేళల్లోనూ మీడియా భేటీలు పెట్టటం ద్వారా చుక్కలుచూపేవారు. ప్రజల తరఫున ఏదైనా అంశంపై ప్రశ్నించే ప్రయత్నం చేస్తే.. వారిని తూలనాడటం.. వారి మాటల్ని ఎటకారం చేసి.. అందరి ముందు పలుచన చేసేవారు. ఇక.. మీడియా అధిపతుల విషయంలో ఆయన ధోరణి ఏమిటన్నది అందరికి తెలిసిందే.

అలాంటి కేసీఆర్‌ కు పవర్‌ పోయిన తర్వాత తనలో మార్పు అనివార్యమన్న విషయాన్ని గ్రహించారు. ఆయన నిజంగా మారారా? అన్న విషయాన్ని పక్కన పెడితే.. సీఎం రేవంత్‌ ఇటీవల కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతుండటంతో ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇందులో భాగంగా బస్సు యాత్రను షురూ చేసిన ఆయన.. త్వరలో టీవీ చానళ్ల వద్దకు వెళ్లి.. ప్రత్యేక ఇంటర్వ్యూల పేరుతో గంటల కొద్దీ సమయాన్ని గడపాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఆయన ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేస్తారనే విషయం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ANN TOP 10