(అమ్మన్యూస్, హైదరాబాద్):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన మధ్యాహ్నం మద్దూరు మండల కేంద్రానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలతో కలిసి కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం బాలాజీ జాతర వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.
సాయంత్రం నాలుగున్నర గంటల తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని భారీ ఎత్తున తరలించేందుకు పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు చర్యలు తీసుకుంటున్నారు.