పదిహేడో సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఏడో విక్టరీ కొట్టింది. సొంత ఇలాకాలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(104 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)ను చిత్తుగా ఓడించింది. ఈ సీజన్ భారీ స్కోర్ బాకీపడ్డ యశస్వీ. ముంబై బౌలర్లను చితక్కొట్టి శతక గర్జన చేశాడు. దాంతో, రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ సంజూ శాంసన్(38 నాటౌట్) సాధికార ఇన్నింగ్స్‌తో మెరిశాడు. దాంతో, ముంబై ఖాతాలో ఐదో ఓటమి చేరింది.
గత వారం రోజులుగా ఉత్కంఠ పోరాటాలు. ఆఖరి ఓవర్ థ్రిల్లర్లు.. కానీ, ఈసారి అవేమీ లేవు. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ముంబై చివరకు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టేబుల్ టాపర్ అయిన రాజస్థాన్ జట్టు ఏమాత్రం తడబడకుండా ఆడి విజేతగా నిలిచింది. మోస్తరు టార్గెట్ అయినా ఓపెనర్లు యశస్వీ(104 నాటౌట్), బట్లర్(35) ధనాధన్ ఆడారు. బుమ్రా మినహా అందర్నీ ఉతికేస్తూ స్కోర్ బోర్డును ఉరికించారు. ఈ జోడీ తొలిసారి 50పైగా రన్స్ జోడించి రాజస్థాన్ విజయానికి బలమైన పునాది వేసింది. అయితే.. స్ట్రాటజిక్ టైమ్‌లో వర్షం పడడంతో అంపైర్లు కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి రాజస్థాన్ స్కోర్ 61/0.
వాన తగ్గాక 10:45కు యథావిధిగా మ్యాచ్ షురూ అయింది. ఈ జోడీని విడదీసేందుకు పాండ్యా.. పీయూష్ చావ్లాకు బంతి ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత శాంసన్ జతగా యశస్వీ మరింత దూకుడుగా ఆడాడు. సిక్సర్లతో చెలరేగి ఈ సీజన్లో తొలి హాఫ్ సెంచరీ బాదేశాడు. అదే ఊపులో రెండో ఐపీఎల్ సెంచరీ సాధించి రాజస్థాన్‌కు అద్బుత విజయాన్ని అందించాడు.
ఆ ఇద్దరు కుమ్మేయగా..
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ముంబై 179 రన్స్ కొట్టింది. 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాండ్యా సేన ఆ మాత్రం స్కోర్ చేసిందంటే అదంతా తిలక్ వర్మ(65), నేహల్ వధేరా(49)ల చలవే. జోరుమీదున్న ఈ ఇద్దరినీ సందీప్ శర్మ వెనక్కి పంపి రాజస్థాన్‌ను పోటీలోకి తెచ్చాడు. ఆఖరి ఓవర్లో ముగ్గుర్ని ఔట్ చేసి ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.