కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా పరిపాలనా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లావ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. కేరళ సరిహద్దుల్లోని 12 చెక్‌పోస్టుల దగ్గర నిఘాను కట్టుదిట్టం చేసింది. కేరళలోని అలప్పుజా జిల్లాతో తమిళనాడులోని కోయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.
అయితే కేరళ నుంచి బర్డ్ ఫ్లూ జిల్లాలోకి ప్రవేశించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని, ఇందులో జిల్లా ప్రజలు అంతగా భయపడాల్సింది ఏమీ లేదని కోయింబత్తూరు పరిపాలనా యంత్రాంగం ప్రకటించింది. కేరళ ప్రభుత్వం అలప్పుజాలోని బాతుల్లో హెచ్1ఎన్1 రకం బర్డ్ ఫ్లూను గుర్తించింది. ఆ బాతుల బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షల కోసం భోపాల్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’కు పంపింది.
ఇదిలావుంటే కేరళ నుంచి కోయింబత్తూరులోకి ప్రవేశించే వాహనాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామని జిల్లా అధికార యంత్రాంగం తెలిపింది. ప్రత్యేకించి వలయార్, వెలంతవాలమ్, మీనాక్షిపురం, గోపాలపురం చెక్‌పోస్టుల దగ్గర నిఘాను పెంచినట్లు వెల్లడించారు. పౌల్ట్రీ రవాణాకు సంబంధించిన వాహనాలను కేరళ నుంచి జిల్లాలోకి అనుమతించడం లేదని చెప్పారు.
జిల్లాలోని 1252 పౌల్ట్రీలను చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నామని కోయింబత్తూరు పాలనా యంత్రాంగం తెలిపింది. ఇక్కడి కోడి మాంసం తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. అయితే సగం ఉడికిన కోడి మాంసం, హాఫ్ బాయిల్డ్ కోడిగుడ్లను తినకూడదని హెచ్చరించింది. చికెన్‌ను గానీ, గుడ్లను గానీ బాగా ఉడికించి తినాలని సూచించింది.