కరీంనగర్‌కు ఎంపీగా ఉండి ఐదేళ్లలో రూ. 12 వేల కోట్ల అభివృద్ధి పనులు చేశామని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. కరీంనగర్‌లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజలకు బీజేపీ అనేక సేవలు అందించిందన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బయటికే రాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్‌లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులను మోసం చేస్తోందని మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అన్నారు. తమ కార్యకర్తలు రాముడి గుడి కోసం ప్రాణత్యాగం చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో రామరాజ్యం రావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అలాగని, తాము రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు. కానీ అవతలి వాళ్లు మాత్రం రాముడి పేరు చెప్పగానే భయపడుతున్నారని కామెంట్స్ చేశారు. గతంలో బీఆర్ఎస్ వాళ్లు కేసులు పెట్టింది మాపైనే… జైలుకు వెళ్లింది మేమే. కానీ మీరు ఓట్లు వేసింది మాత్రం కాంగ్రెస్ వాళ్లకు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
