(కేఆర్‌ఆర్.. వీకెండ్ అనాలసిస్)
జంక్షన్ లో తెలంగాణ పాలిటిక్స్
లోక్ సభ ఎన్నికల చుట్టూ పార్టీల స్టంట్స్
గోడపై ఉన్నదెవరు? గోడదూకాలంటే కండిషన్లు పెట్టిందెవరు?
రేవంత్ కాన్ఫిడెన్స్ కు కారణమేంటి?
కేసీఆర్ కార్యాచరణ వెనుక ఉన్న కథేంటి?
మోడీ వేవ్ తెలంగాణపై చూపే ఎఫెక్ట్ ఎంత?
అమ్మన్యూస్ సిఈవో జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ ఎనాలసిస్
ఇపుడు తెలంగాణ పాలిటిక్స్ అసెంబ్లీ ఎన్నికలను మించిన హై ఓల్టేజ్ క్రియేట్ చేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల నామినేషన్ల వేడి టెంపరేచర్ ను మరింత పెంచుతోంది. ఉన్నవి 17 సీట్లు. కానీ ఇందులో మెజారిటీ సీట్లే.. తర్వాత ఐదేళ్ళు ప్రభుత్వ సుస్థిరతకు ఇంధనం. లెక్కప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వ సుస్థిరతకు ఎలాంటి ఢోకాలేదు. అవసరమైన మెజారిటీతో సింగిల్ గా పవర్ లోకి వచ్చింది. 60సీట్లు అవసరమున్నచోట 65సీట్లతో దుర్భేద్యంగా ఉంది. కానీ మోడీ మార్క్ పాలిటిక్స్ పై సమాజంలోని అన్ని వర్గాల్లో ఓ చర్చ జరుగుతోంది. అందుకే జంపింగ్ లపై ఎన్నడూ లేనంత చర్చ రచ్చ జరుగుతోంది. ఇవన్నీ ప్రజాస్వామ్యానికి మంచివి కావు. కానీ ఇపుడు ప్రజాస్వామ్యం
ఓ’వేలం’ వెర్రి. గెలవటమే కాదు. కొనటం తెలిసిన వాడే సికిందర్. ఇదీ నేటి ట్రెండ్.
ఇక్కడ గాయం చేసినోడే లేపనం రాస్తాడు
హంతకుడే సంతాపం ప్రకటిస్తాడు
కత్తుల పూలతో కన్నీళ్లు తుడుస్తాడు
నయా రాజకీయ ట్రెండ్ ఇదే. ఒక్క ఓటమితో గంగలో మునిగి స్నానం చేశామంటూ నేతల గొప్పలకు పోతారు. తమ తప్పులన్నీ.. అధికారంలో వచ్చిన పార్టీకి ట్రాన్స్ ఫర్ చేసి నిలదీతలు షురూ చేస్తున్నారు. తాజాగా గులాబీదళపతి కేసీఆర్ సభలు, సమావేశాల్లో చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు వీటికి భిన్నంగా ఏమీ లేవు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి బురదే జల్లాలి.. అనే మార్కు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. అధికారంలో ఉన్నపుడు సొంతపార్టీ ఎమ్మెల్యేలకు కూడా టచ్ లోకి రాని నాయకుడు.. ఇపుడు తమ ప్రత్యర్ధులు టచ్ లోకి వచ్చారంటూ ప్రకటనలు చేస్తుండడం విస్మయం కలిగించేదే. ఓవైపు 25మంది టచ్ లో ఉన్నారని ప్రకటించగానే, మరోవైవు ఆరునెలలు సొంతపార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.. అహంకారి అంటూ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వీయ అనుభవాలు ప్రకటించారు. తెలంగాణ రాజకీయాల్లో ట్వంటీ మ్యాచ్ ట్రెండ్ తెచ్చింది కేసీఆర్. దాని ఫలితాలు ఆయన కూడా అనుభవిస్తున్నారు. నాలుగుమాసాల్లో అధికారపార్టీ అనిపించుకుంటే చాలని గోడదూకుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలే వీటికి నిదర్శనం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ అనేక సవాళ్ళు
సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే లోక్ సభ ఫలితాలు
చరిత్రలో రాజుల దండయాత్రలు ప్రజాస్వామ్యంలో నాయకుల దాడులు సాధారణం
మోడీ కాలంలో.. తప్పదు అప్రమత్తం
లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధిస్తే రేవంత్ సర్కారుకు తిరుగుండదు. ఆయన బలహీనమవ్వాలని చూసే నాయకులు, శక్తులు కొంతకాలం ఆశ చంపేసుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే అనేక వర్గాల సమస్యలను రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు. సమీక్షించారు. తక్షణం అవకాశం ఉన్నవి పరిష్కరించారు. 30వేలకు పైగా ఉద్యోగ నియామక పత్రాలు మూడుమాసాల్లో అందించి చిత్తశుద్ది నిరూపించుకున్నారు. ఆరుగ్యారంటీల అమలు దిశగా అడుగులు వేశారు. పాలనపై అవగాహన పెంచుకుంటూ పట్టుబిగించే ప్రయత్నాలు చేశారు. ఆర్ధికవ్యవస్థను గాడిలో పెట్టే చర్యలు చేపట్టారు. అప్పుల తిప్పలు తీరుస్తూనే ఆర్ధిక క్రమశిక్షణను విధించారు. పాలకుడిగా ముద్రవేస్తున్న దశలోనే.. వందరోజుల్లోనే వచ్చిన ఎన్నికలు సరికొత్త సవాల్ ను విసిరాయి. రేవంత్ రెడ్డికి సవాళ్ళు కొత్త కాదు. సవాల్ ఎదురైనపుడల్లా మరింత రాటుదేలిన నాయకుడు. ఈ లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ నాయకత్వమంతా సవాల్ గా తీసుకుని పోరాడితే మెరుగైన ఫలితాలు సాధ్యమే. బిజెపి తన బలం పెంచుకోగలుగుతుందా? బీఆర్ఎస్ సీట్లు సాధిస్తుందా? అన్నవి కూడా.. రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్న ప్రశ్నలు. అన్నింటికీ ప్రజల తీర్పే సమాధానం.
ఇదీ ఈ వారం వీకెండ్ అనాలసిస్ బై కెఆర్ఆర్