చిలుకూరు బాలాజీ ఆలయంలో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గరుడ ప్రసాద పంపిణీ ఉంటుందని, సంతానం లేని వారు ఈ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుందని, ఈ బ్రహ్మోత్సవాల గొప్పతనం ఇదని, పిల్లలు లేని మహిళలు ఉదయం 8 గంటల వరకు బాలాజీ ఆలయానికి రావాలి.. అంటూ ఆలయ పూజారి సోషల్‌మీడియాలో భక్తులకు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 5 నుంచి 6 వేల వరకు భక్తులు రావచ్చని బ్రహ్మోత్సవాల నిర్వాహకులు, పూజారులు కూడా అంచనా వేశారు. కార్యక్రమం, భక్తుల రాకపై కూడా స్థానిక పోలీసులకు ఆలయ నిర్వాహకులు సమాచారమిచ్చారు. అయితే, ఈసారి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ లక్షలాది మంది భక్తులు తెల్లవారుజాము 3 గంటల నుంచే చిలుకూరు ఆలయానికి క్యూ కట్టారు. దీంతో ఉదయం 6 గంటల వరకే ఔటర్ రింగ్ రోడ్డు అప్పా జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. 8 గంటల వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు నిద్రలేచి వచ్చే సరికే ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పరిస్థితితో తలలు పట్టుకున్నారు.
ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి
చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు ఊహించని రీతిలో రావడంతో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ప్రతి నిత్యం హైదరాబాద్‌కు, ఇటు తాండూరు, వికారాబాద్, పరిగి, కర్ణాటకకు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఉదయమే ఉద్యోగాలు, కళాశాలలు, దవాఖానలకు వెళ్లే వారు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బంది పడ్డారు. వివాహ వేడుకలకు వెళ్లే వారు సైతం ఈ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఈ ట్రాఫిక్ జామ్‌తో భక్తులు తమ వాహనాలను జాతీయ రహదారి పక్కన పార్కింగ్ చేసి, ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు.