(అమ్మన్యూస్, హైదరాబాద్):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర పర్మిషన్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ నాయకులు వాసుదేవా రెడ్డి శుక్రవారం కలిశారు. బస్సు యాత్ర వివరాలను వికాస్ రాజ్‌కు వాసుదేవా రెడ్డి అందజేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించి భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసుల సహకారం అందించేలా చూడాలని కోరారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవా రెడ్డి కోరారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలుంటాయని, పార్టీకి అనుకూలంగా ఉండే రూట్‌మ్యాప్‌ను, ప్రదేశాలను నాయకులే కూర్చొని నిర్ణయించాలని నిన్న జరిగిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేసీఆర్ సూచించారు. రోడ్‌షోలు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు.