తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో.. నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. తొలిరోజే ఆయా పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మరోవైపు.. ఎంపీ అభ్యర్థులంతా ఎన్నికల్లో బిజీ బిజీగా ప్రచారం నిర్వహిస్తుండగా.. నామినేషన్ కోసం ఆర్వో కార్యాలయానికి రావాల్సి ఉండగా.. అదేమీ అవసరం లేకుండా ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఆన్లైన్లోనే నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని సీఈసీ వికాస్ రాజ్ వెల్లడించారు.
నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా లెటెస్ట్ ఫోటోలు పెట్టాలని వికాస్ రాజ్ తెలిపారు. లేదంటే నామినేషన్ పత్రాలను రిజెక్ట్ చేస్తామని వికాస్ రాజ్ సూచించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వికాస్ రాజ్ కీలక సూచనలు చేశారు. నామినేషన్ ఫామ్.. అఫిడవిట్లు జాగ్రత్తగా నింపాలని తెలిపారు. ఫాం-ఏ, ఫాం-బీపై ఒరిజినల్ సంతకాలు ఉండాలని వికాస్ రాజ్ తెలిపారు.
ఇదిలా ఉంటే.. నామినేషన్ పేపర్లు దాఖలు చేసే సమయంలో ఒకసారి ఆర్వో కార్యాలయంలోకి ప్రవేశిస్తే.. బయటకు వెళ్లేందుకు వీలు లేదని వికాస్ రాజ్ తెలిపారు. నామినేషన్ పత్రాల దాఖలు కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయమని ఆర్వోలను ఆదేశించినట్టు చెప్పుకొచ్చారు. అభ్యర్థి కచ్చితంగా క్రిమినల్ హిస్టరీ పబ్లిష్ చెయ్యాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థి ముందు రోజు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఎన్నికల ఖర్చు అకౌంట్లో చూపించాలని.. గతంసారి ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్ ఈసారి మళ్లీ ఉపయోగించవద్దని వికాస్ రాజ్ వివరించారు.









