AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టచ్‌లో 25 మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం: కేసీఆర్‌

రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించేలా లేదని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రతిసారీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కాంగ్రెస్‌ ముఖ్యనేత ఒకరు తనతో చెప్పారని పేర్కొన్నారు.

ఒకవేళ అదే జరిగితే తాము బీఆర్‌ఎస్‌, ఎంఐఎంతో కలవాల్సి ఉంటుందని ఆయన అన్నారని వివరించారు. కట్టర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌తో కలిసి బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదని, తనతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, తాను మాత్రం బీఆర్‌ఎస్‌కే మద్దతు ఇస్తానని కాంగ్రెస్‌ నేత తనతో చెప్పారని కేసీఆర్‌ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో పార్టీ లోక్‌సభ అభ్యర్థులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ఉద్యమకాలం నుంచి నేటివరకు తెలంగాణ ప్రజల హకులను కాపాడుతూ వస్తున్నది బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని చెప్పారు. పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వారు ఢిల్లీలో తెలంగాణ ప్రజల గొంతుకలై పనిచేస్తారని పేర్కొన్నారు. ‘తెలంగాణ గొంతుక బీఆర్‌ఎస్‌, తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్‌, తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్‌ఎస్‌, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్‌ఎస్‌’ అని చెప్పారు. రాష్ట్రం మీద కాంగ్రెస్‌కు మమకారం లేదని విమర్శించారు.

ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చు
పార్లమెంట్‌ ఎన్నికల తరువాత ప్రభుత్వంలో ఏమైనా జరగొచ్చని, ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందన్నది అనుమానమేనని కేసీఆర్‌ పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ 104 సీట్లు, ఎంఐఎం 7 సీట్లతో కలుపుకొని బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించిన కేసీఆర్‌.. 65 సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఉండనిస్తారా? అని ప్రశ్నించారు. ‘రేవంత్‌రెడ్డి బీజేపీలోకి పోతాడని కేటీఆర్‌ అంటుండు.

ఆయన బీజేపీలోకి వెళ్లి ప్రభుతాన్ని ఏర్పాటు చేయాలంటే 58 మంది కాంగ్రెస్‌ సభ్యులు కావాలి. రేవంత్‌ వెంట అంతమంది పోరు. పాత కాంగ్రెస్‌, కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాళ్లు ఆయనతో పోరు. దీంతో ఏం జరుగుతదో అర్థం కావడంలేదు. మోదీ ప్రమాదకరమైన వ్యక్తి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఎటైనా దారితీయవచ్చు. బీజేపీ జమానాలో ఏమైనా సాధ్యమే. నవంబర్‌, డిసెంబర్‌ కల్లా ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా తెలియదు’ అని కేసీఆర్‌ అనుమానం వ్యక్తంచేశారు.

ANN TOP 10