AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇది లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వం.. కూలడం ఖాయం

రైతాంగం, ప్రజలు కాంగ్రెస్‌పై తిరగబడుతున్నారు
తెలంగాణను సాధించినట్లుగానే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తెస్తా..
కాంగ్రెస్‌కు రెండు సీట్ల కంటే ఎక్కువ రావు
సుల్తాన్‌పూర్‌ బహిరంగసభలో కేసీఆర్‌ వ్యాఖ్యలు

ఇది లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వమని, కూలడం ఖాయమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జోస్యం చెప్పారు. తెలంగాణలో ప్రభుత్వంపై జనం తిరగబడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద జరిగిన ప్రజాఆశీర్వాద బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణను తెచ్చినట్లుగానే రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘ తెలంగాణలో జనం తిరగబడ్డారు.. అన్ని జిల్లాల్లో రైతాంగం తిరగబడుతోంది.. సర్వే రిపోర్టులు వస్నున్నాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు.. నారాయణపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి భయం చూస్తే ఈ ప్రభుత్వ ఏడాది కూడా ఉండేలా లేదు.. ముఖ్యమంత్రే జంప్‌ కొడుతడో.. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తరో తెలుస్తలేదు.. ఇక్కడో మాట మాట్లాడి ఢిల్లీకి వెళ్లి బీజేపీకి ఓట్లేయాలని టీవీల్లో చెబుతాడు.. ఎవరికి ఎవరు బీ టీం.. ఎవరు ఎవరితో కలిసిపోయారు..’’ ప్రజలు అలోచన చేయాలి.

అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నారు..
‘‘ ఇంటికి గుడ్డి లక్ష్మి వచ్చినట్లుగానే.. లిల్లీపుట్‌ గాళ్లకు అధికారం వస్తుంది.. సేవ చేయమని ప్రజలు అధికారం ఇస్తే అడ్డదిడ్డమైన పనులు చేస్తున్నరు.. ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల ఎత్తున్న మహనీయుడు అంబేద్కర్‌ విగ్రహాన్ని కట్టుకున్నాం.. అంబేద్కర్‌ జయంతి రోజు ఈ లిల్లీపుట్‌ గాళ్ల ప్రభుత్వం ఆ మహనీయుని వద్దకు వెళ్లలేదు.. పూల మాల వేయలేదు.. అంజలి ఘటించలేదు.. గేట్లు బంద్‌ చేసి తాళాలు వేశారు.. అంబేద్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌కు ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో చురుకు పెట్టాలే..’’ అని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

సింగూరు నీళ్లు ఇవ్వలేదు..
లిల్లీపుట్‌ గాళ్ల పార్టీ మెదక్, నిజామాబాద్‌ జిల్లాలకు సింగూరు నుంచి ఒక్క చుక్క నీళ్లు ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. ఈ సింగూరు జలాల కోసం ఈ రెండు జిల్లాల రైతులు ధర్నాలు చేశారని గుర్తు చేశారు. ఈ సింగూరు ప్రాజెక్టుపై ఉమ్మడి మెదక్‌ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ సింగూరు ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం కోల్డ్‌స్టోరేజీలో పెడుతోందని విమర్శించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10