AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పంట బోనస్‌ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తాం.. హరీశ్‌రావు హెచ్చరిక

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్‌ వెంటనే చెల్లించాలని.. లేదంటే రైతులతో కలిసి సచివాలం ముట్టడిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు హెచ్చరించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో హరీశ్‌రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, మక్కలకు రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదని మండిపడ్డారు. వరి ధాన్యానికి మద్దతు ధర, బోనస్‌ ప్రభుత్వం చెల్లించే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ రైతులకు అండగా ఉంటుందని అన్నారు. రైతుల కోసం అవసరమైతే సచివాలయం ముట్టడిస్తామని తెలిపారు.

రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని నేపథ్యంలో రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేదంటే తగిన గుణపాఠం నేర్పుతామని సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు లేఖలు రాయాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలోని ప్రతి రైతు ముఖ్యమంత్రికి లేఖలు రాయాలని కోరారు. రైతు నాయకులు, బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులతో ఉత్తరాలు రాయించాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రూ.2 లక్షలు పంటరుణమాఫీ చేయటంతోపాటు రూ.500 బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే తాము ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడాను గుర్తించారని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులతోపాటు అన్నివర్గాలకు అండగా ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు రెండు తమ అధికారాన్ని కాపాడుకునేందుకు ఒక్కటయ్యాయని అన్నారు.

ANN TOP 10