కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో మోస పూరిత హామీలు గుప్పించిందని, ఇప్పుడు వాటిని అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నదని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పదే పదే ప్రచారం చేశారని గుర్తు చేశారు. అదే సమయంలో ఎన్ని అబద్ధాలు ఆడి అయినా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడ్డగోలుగా హామీలు గుప్పించారన్నారు.
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని నేనేనని కీలక వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు తన కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారంటూ కీలక ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. కేసీఆర్ హయాంలో.. తన కేబినెట్‌లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదన్నారు ఈటల రాజేందర్.
మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి.. భార్యభర్తల సంభాషణలు కూడా విన్నారని ఈటల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూడా కూలిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధకరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించారంటూ తీవ్ర విమర్శలు చేశారు ఈటల. ఎమ్మెల్యేగా ఉన్నా.. కనీసం ప్రోటోకాల్ కూడా లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, బీఆర్ఎస్ నుంచి మెడలు పట్టి బయటకు పంపితే.. బీజేపీ తనను అక్కున చేర్చుకుందన్నారు ఈటల. ఇక.. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైనే గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.