తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఆయన వెంట కాంగ్రెస్ అగ్రనేతలు మున్షీ, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఐదు గ్యారెంటీల పత్రం పేరుతో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రులు కూడా వేదికపై కూర్చున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మంచి జోష్ మీద కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండంకెల స్థానాలను కైవసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తుక్కుగూడ నుంచి సమరశంఖాన్ని పూరించింది. అందరి సమక్షంలో తుక్కుగూడ జనజాతర సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో ఆవిష్కరించారు రాహుల్ గాంధీ. తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో 23 అంశాలు పొందుపరిచారు. కొన్ని నెలల క్రితం తెలంగాణకు చేసిన వాగ్ధానం ప్రకారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లు దేశంలోనూ మాట నిలబెట్టుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఐదు న్యాయసూత్రాలు భారతీయుల ఆత్మగా అభివర్ణించారు.
తాము అధికారంలోకి వస్తే దేశంలోని యువతకు శిక్షణా కార్యక్రమాలు పెట్టబోతున్నామని వెల్లడించారు. ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టామని వివరించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజలు నిరుపేదలయ్యారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలిచ్చామని.. మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నామన్నారు. పేదల ప్రతి ఇంటికి రూ.500కు గ్యాస్ సిలిండర్ వచ్చేలా చేశామన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దేశ ప్రజల మనసులోని మాటే తమ మేనిఫెస్టో అని చెప్పారు. నారీ న్యాయ్‌తో దేశ ముఖ చిత్రం మారబోతోందని తెలిపారు. ప్రతి మహిళ ఖాతాలోకి రూ.లక్ష నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తామన్నారు.దేశంలో నిత్యం 30 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. తాము అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని హామీల వర్షం కురిపించారు. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం రైతులకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు.