మాజీ ఎమ్మెల్యే ఇరువర్తి అనిల్‌కు టీఎస్ పీఎస్సీ మాజీ చైర్మన్, ప్రొ.ఘంటా చక్రపాణికి మధ్య ట్విట్టర్ (ఎక్స్)లో వార్ నడుస్తోంది. దీనికి గత కారణం ఓ నెటిజన్ చేసిన ట్వీట్ పై చక్రపాణి స్పందించగా దాంతో ఈ ఇరువురి మధ్య డైలాగ్ వార్‌కు దారి తీసింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకు వెళ్లబోతున్నారని, అదే మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ లో ఎండిపోయిన పండల పరిశీలనకు బయలుదేరారని వీరిద్దరి మధ్య ఎవరి ప్రయార్టీ ఎలా ఉందో గమనించాలంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై స్పందించిన ఘంటా చక్రపాణి ‘సమస్య అంతా ఇక్కడే. ఈరోజు వరకు ఆయన పనికిరాని రాజకీయ నాయకుల ఇళ్లకు తప్ప ప్రజల్లోకి పోలేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇరువర్తి అనిల్ స్పందిస్తూ.. మూడు పేపర్ లీకులు, ఆరు ప్రశ్నాపత్రాల అమ్మకాల స్థాయికి టీఎస్పీఎస్సీని దిగజార్చి, లక్షలాది మంది నిరుద్యోగుల బతుకులతో ఆడుకున్న “సూడో మేథావి…” ఘంటా చక్రపాణి అంటూ విమర్శించారు. ప్రజాక్షేత్రమే కార్యక్షేత్రంగా.. సామాన్యుడి ముఖ్యమంత్రిగా…, అన్నా.. అని పిలిస్తే పలికే రేవంతన్న గురించి మాట్లాడటం విచిత్రం.. విడ్డూరం!! మాజీ ముఖ్యమంత్రి పదేళ్లు ఫాంహౌస్ నుండి బయటకు రాని నాడు ఏనాడైనా ఈ “సూడో మేథావి” గొంతు విన్నారా!? అంటూ ట్వీట్ చేశారు.
దీంతో ఆ వ్యాఖ్యలపై ఘాంటా చక్రపాణి స్పందించి ఈ విధంగా ట్వీట్ చేశారు.. ‘అనిల్ గారు పేపర్ లీక్ లు, అమ్మకాలకు సంబంధించి సమాచారం నాకు తెలియసు. మీకు చాలానే వాటితో సంబంధం ఉన్నట్టుంది. తెలిసినట్టు ఉంది. నా హయాంలో అలాంటివి జరుగలేదు. జరిగినట్టు మీ దగ్గర సమాచారం ఉంటే సిట్ దృష్టికి తెండి. లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు అవుతారు. నేను మేధావినా, సూడో మేధావినా తరువాత, మీరు మాత్రం చైర్మన్ గా అపాయింట్మెంట్ కాక పోయినా, జీవో రాకపోయినా, ఛార్జ్ తీసుకోక పోయినా చైర్మన్ అని రాసుకుని అలాగే చలామణి అవుతున్నారు. సూడో అంటే అర్థం అదే. చట్టరీత్యా అది నేరం. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మీకు ఎంత తెలుసు నాకు తెలియదు, నాకు మాత్రం బాగానే తెలుసు. మర్యాదగా ఉండండి. ఎక్ట్ర్సాలు వద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఆ ట్వీట్‌పై స్పందించిన ఇరువర్తి అనిల్.. ‘ చక్రపాణి గారూ.. నేను పెట్టిన ట్వీట్లో చాలా స్పష్టంగా రాశాను. టీఎస్పీఎస్సీ వ్యవస్థను పేపర్ లీకులు, ప్రశ్నాపత్రాల అమ్మకాల స్థాయికి దిగజార్చారు అన్నాను కానీ, మీ హయాంలో జరిగాయని అనలేదన్నారు. మీ హయాంకు కొనసాగింపులో నేరాలు జరిగాయన్నది నిజం. మీ హయాంలో వ్యవస్థ దిగజారింది అన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. జరిగిన నేరాలపై నాడు మీరు ఎందుకు నోరు మెదపలేదో తెలంగాణ సమాజానికి చెప్పండి.కొండంత ఆశతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగులకు నాడు టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన న్యాయం ఎంతో కూడా యువతకు తెలుసు. మీరు రాజకీయ విమర్శలు చేయదలచుకుంటే బీఆర్ఎస్లో చేరి మాట్లాడితే మంచింది. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడం కంటే పెద్ద నేరం ఏముంటుంది!? ఒక్క సారి ఆత్మపరిశీలన చేసుకోండని ట్వీట్ చేశారు. ఇలా ఇద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది.









