ఉప్పల్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఇరు జట్ల ఫ్యాన్స్ పోటాపోటీగా తరలి రావడంతో స్టేడియం అంతా ఆరెంజ్, పసుపు రంగులమయమైంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఓ విశిష్ఠ అతిథి హాజరయ్యారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ తిలకించారు.. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్ చూస్తున్నారు. రేవంత్ రెడ్డి రావడాన్ని చూసిన పలువురు అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం… సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
మ్యాచ్ చూసేందుకు ముఖ్యమంత్రి రావడంతో భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు పక్కనే నటుడు వెంకటేశ్ కూర్చొని మ్యాచ్ తిలకిస్తున్నారు. మ్యాచ్ చూస్తున్న వారిలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడిన చెన్నై తొలుత బ్యాటింగ్‌ను ప్రారంభించింది.









