కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలపై కక్ష కట్టిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కార్ నేతన్నలకు ఆర్డర్లను నిలిపివేసిందని, నేతన్నలకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అంటూ నిలదీశారు. కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా ? పదేళ్ల తరువాత సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నాటి సంక్షోభం ఇప్పుడు వచ్చిందన్నారు. నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయని, నేతన్నలకు అర్డర్లు అపేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వెంటనే ఇవ్వాలని కోరారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. అవసరం అయితే మరింత సాయం చేయాలని పేర్కొన్నారు. కేవలం గత ప్రభుత్వంపై దుగ్ధలో నేతన్నల కడుపు కొట్టడం సరైనది కాదన్నారు. రైతన్న మాదిరే, నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధకరమన్నారు. వస్త్ర పరిశ్రమలను ఆదుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లు కళకళ లాడిన చేనేత రంగం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షోభంలో కూరుకుపోందన్నారు. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, ముందు చూపు లేకపోవడం వల్లే వేలాది మంది చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు దుర్భరంగా మారుతున్న మీ ప్రభుత్వానికి కనీస కనికరం లేదని కేటీఆర్ విమర్శించారు. నేతన్నల సంక్షోభాన్ని రాజకీయ కోణంతో కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాలైన నేతన్నల కోణంలో వెంటనే పరిష్కరించాలని.. రాష్ట్రంలోని నేతన్నల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.









