బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలుతోందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండని సవాల్ విసిరారు. శనివారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని, దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వాన్ని కులగొడతామంటున్నారని, మీరు ఏమైనా జ్యోతిష్యం చెప్పారా..? అని ఎద్దేవా చేశారు. మూర్ఖులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చేతనైతే 10 సంవత్సరాల్లో దేశ ప్రజలకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటుని ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారు దీనిపై మీరు మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారా అని పొన్నం ప్రభాకర్ నిలదీశారు.
కేటీఆర్‌కు సవాల్..
బీఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు. ముఖ్యమైన పదవులు చేపట్టి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బలహీన వర్గాలకు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం వచ్చాక కులగణన చేపట్టామని,16 కులాలకు కార్పొరేషన్లు కేటాయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అడిగే స్వేచ్ఛ తమకుందన్నారు. 23 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీలో బలహీన వర్గాలకు ఏ ఒక్కరికి న్యాయం చేయలేదన్నారు. బీజేపీ బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుండి తొలగించి కిషన్ రెడ్డికి ఇచ్చిందని విమర్శించారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు అన్ని బయటకు వస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.









