బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని, ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. కొట్లాడి టికెట్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నుంచి.. ఇచ్చిన టికెట్లను కూడా కాదనుకుని కారు దిగి వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఓటమి ఖాయమని అర్ధం చేసుకోవాలని అన్నారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కవ్య వరకు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పుతున్నారని అన్నారు. తొందరగా టైటానిక్ షిప్ నుంచి కేసీఆర్ కుటుంబం బయటకు రావాలని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు.
ప్రజల రక్తాన్ని పిప్పి చేసి సేవ చేస్తామని రాజకీయాల్లోకి వస్తున్నారని మెదక్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా గెలవడు అని కామెంట్స్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని తెలిపారు. రఘునందన్ రావు ఎవ్వరి జోలికి వెళ్లడని, తన జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ మోసాలను ప్రజలకు ఎండగడుతామని, ఫోన్ ట్యాపింగ్‌లో మొదట జైలుకు వెళ్లే వ్యక్తి హరీష్ రావు అంటూ రఘునందన్ రావు దుయ్యబట్టారు.