హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరడంపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ తనకు సొంత ఇళ్లులాంటిదని చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని.. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. 53ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు. బీఆర్ఎస్లో తాను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్లో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు. తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని కేశవరావు తేల్చిచెప్పారు.
తాను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్లోనేనని… ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను బీఆర్ఎస్కు ఇంకా రిజైన్ చేయలేదన్నారు. తన కూతురు కాంగ్రెస్‌లో చేరిన రోజు.. తాను ఆ పార్టీలో చేరట్లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరే తేదీ ఖరారు అయిన తర్వాత తానే చెబుతానని అన్నారు. తన కుమారుడు మాత్రం బీఆర్ఎస్లోనే ఉండాలని అనుకుంటున్నారన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని కేశవరావు స్పష్టం చేశారు.









