వైఎస్ షర్మిల, సునీతపై సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరు సిద్ధం సభలో జగన్ ప్రసంగిస్తూ… బాబాయిని చంపించింది ఎవరో ప్రజలకు తెలుసు అని అన్నారు. చెల్లెమ్మల వెనుక ఎవరు ఉన్నారో కూడా ప్రజలకు తెలుసని చెప్పారు. హంతకుడికి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తాను మాత్రం ప్రజల పక్షమేనని అన్నారు. చిన్నాన్నను చంపించిన వాళ్లతో చెల్లెమ్మలు కలిశారని చెప్పారు.
‘మీ అర్జునుడు సిద్ధం.. మీరు సిద్ధమా’ అని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు నాయుడికి 45 ఏళ్ల అనుభవం ఉందని చెప్పారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపి, ఆయన విగ్రహాలకు పూలమాలలు వేశారని అన్నారు. నాడు వెన్నుపోటు పొడిచి, నేడు దండలు వేసి దండాలు పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుకు నైతిక విలువలు లేవన్నారు.
కూటమి అంటే కుట్రలు.. కుతంత్రాలని జగన్ అన్నారు. తమ జెండా మాత్రం మరో జెండాతో జతకట్టలేదని చెప్పారు. కేంద్రం నుంచి ఓ పార్టీని తెచ్చుకున్నారని అన్నారు. ఇటీవల చోటుచేసుకున్న డ్రగ్స్ కేసు వెనుక చంద్రబాబు వదిన గారి చుట్టం ఉన్నారంటూ ఆరోపణలు చేశారు.
వీళ్ల రాజకీయాలు ఎవరికి స్ఫూర్తిదాయకమని జగన్ ప్రశ్నించారు. ఒక్క జగన్‌పై యుద్ధానికి ఇంతమందా అని నిలదీశారు. తనతో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం వాళ్లకు లేదని జగన్ చెప్పారు. ‘మళ్లీ చంద్రముఖి లకలక అంటూ సైకిలెక్కి వస్తుంది. ముగ్గురూ కలిసి ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా? ఫ్యాన్ ఇంట్లోనే… సైకిల్ బయట…. తాగేసిన గ్లాస్ సింక్‌లోనే ఉండాలి’ అని జగన్ వ్యాఖ్యానించారు.