నా భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు
(అమ్మన్యూస్, వరంగల్):
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టబోమని ఆమె అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త కొండా మురళీ ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. బీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కూతురుగా ఉన్నప్పుడు లిక్కర్ అక్రమ వ్యాపారం చేశారని కొండా సురేఖ ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని, మేఘా కృష్ణారెడ్డి బీజేపీకి వెయ్యి కోట్ల రూపాయలను పార్టీ ఫండ్‌గా ఇచ్చారని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం అవినీతిపై నోరు మెదపడం లేదని అన్నారు. ఇక మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి మాట్లాడుతూ.. కొత్త-పాత కార్యకర్తలను కలుపుకుని పోతామని అన్నారు. వారంలో ఐదు రోజులు క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని ప్రజలు, పార్టీ శ్రేణులకు ఆయన హామీ ఇచ్చారు.
