ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసు డబ్బులు ఎక్కడున్నాయో.. రేపు కోర్టులోనే కేజ్రీవాల్ వెల్లడిస్తారని వ్యాఖ్యానించింది. బుధవారం సునీతా కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీతా కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్‌లో నిజానిజాలను తన భర్త గురువారం కోర్టులో బయట పెట్టనున్నట్లు తెలిపారు. గడిచిన రెండేళ్లలో ఈడీ 250 పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిందని ఒక్క పైసా దొరకలేదన్నారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ నివాసంలో ఎలాంటి డబ్బులు దొరకలేదని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడన్నారు. తన శరీరం జైల్లో ఉన్నా.. ఆత్మ ప్రజల్లోనే ఉందని వెల్లడించారు. ఇప్పటివరకు సోదాల్లో నగదు దొరకలేదని, ఆ నగదు ఎక్కడ ఉందో రేపు కేజ్రీవాల్ కోర్టులో చెప్తారని అన్నారు. కేజ్రీవాల్ కోర్టుకు ఆధారాలు కూడా చూపిస్తారని చెప్పారు.
రేపు కోర్టు ముందుకు సీఎం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు ఈ నెల 21వ తేదీన అరెస్ట్ చేశారు. 22న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా.. ఆయనకు న్యాయస్థానం 6 రోజుల ఈడీ కస్టడీకి విధించింది. ఈరోజుతో ఈడీ కస్టడీ ముగుస్తుంది. అయితే ఆయనను రేపు కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌ను మరో ఐదు రోజులు ఈడీ అధికారులు కస్టడీకి అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అరెస్టుపై కేజ్రీవాల్ సతీమణి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె చెప్పిన విధంగా రేపు కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారో ఉత్కంఠగా మారింది.