కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రైతులు లేదంటున్నారని చెప్పారు. సాగునీరు.. తాగు నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పంటలు ఎండి పోతుంటే రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కళ్లలో కన్నీరు, ఆవేదన చూశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్ర ఆందోళనతో ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ విషయం పట్టడం లేదని విమర్శించారు. ఇతర పార్టీల నుంచి చేరికలపై ఆలోచన తప్ప రైతుల గురించి సీఎంకు ఆలోచనే లేదని దుయ్యబట్టారు. రైతులు కష్టాల్లో ఉంటే బ్యాంకు అధికారులు వచ్చి అప్పు గురించి నోటీసులు ఇస్తున్నారని తెలిపారు.
అప్పులు కట్టాలని బ్యాంక్‌ల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. బకాయిలు కట్టుకపోతే ఆస్తులు జప్తు చేస్తామని బ్యాంక్ అధికారులు అంటున్నారని, బ్యాంక్ అధికారులు రజాకార్లను తలపించేలా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. బ్యాంకర్లు గ్రామాల్లోకి వెళ్లి రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, పంట రుణం కట్టకపోతే కేసులు పెడుతామని నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు చేస్తామని మోసం చేశారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ నేతలు రేపటి నుంచి పొలాల్లోకి వెళ్లాలని కోరారు. పంట నష్టం వివరాలు సేకరణతో పాటు రైతులకు ధైర్యం కల్పించాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా రైతుల కోసం అన్ని రకలుగా పోరాడుతామని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలే కాదు.. రైతుల ప్రయోజనాలు కూడా ముఖ్యమేనని స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు అప్పులు కట్టవద్దని, బీఆర్‌ఎస్ మీకు అండగా ఉంటుందన్నారు. అవసరమైతే రైతులతో కలిసి సచివాలయం ముట్టడిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రుణమాఫీ పైనే మొదటి సంతకం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లు గుర్తు చేశారు. ఏ ముఖం పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు కూడా రైతులకు భరోసా కల్పించడం లేదని పేర్కొన్నారు.