భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. టెన్త్ విద్యార్థినిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళ్తే .. సుజాతనగర్ మండలానికి చెందిన ఓ బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది. టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కావడంతో ఈ నెల 18న పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్లింది. అక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. కంగారుపడి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బాలిక గర్భవతి అని తెలిసింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలికను ఆరా తీయగా.. అదే గ్రామానికి చెందిన ఓ విద్యార్థి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. ఈ క్రమంలో బాలిక తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా బాలుడికి రూ.2 లక్షల జరిమానా విధించారు. కాగా, బాలిక తల్లిదండ్రుల ద్వారా విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.