దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తొలి దశలో 102 లోక్‌సభ స్థానాలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ సహా 21 రాష్ట్రాల పరిధిలో 102 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈశాన్య భారతంలోని ఆరు రాష్ట్రాల్లో 9 లోక్‌సభ స్థానాలతో పాటు.. తమిళనాడులోని 39 స్థానాలు, లక్షద్వీప్‌లోని ఒక లోక్‌సభ స్థానంలో మొదటి దశలో పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో భాగంగా ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 21 రాష్ట్రాల్లోని 102 స్థానాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. మార్చి 27 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీహార్‌లో స్థానిక పండుగ దృష్ట్యా మార్చి 28 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
తొలి దశలో..
తొలి దశలో అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు, బీహార్‌లో నాలుగు, అస్సాంలోని నాలుగు, ఛత్తీస్ గఢ్ నుంచి ఒక లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆరు, మహారాష్ట్రలో ఐదు, మణిపూర్‌లో రెండు, మేఘాలయలో రెండు, మిజోరాంలో ఒక స్థానానికి తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నాగాలాండ్‌లో ఒకటి, రాజస్థాన్‌లో 12, సిక్కింలో ఒకటి, త్రిపురలో ఒకటి, తమిళనాడులో 39, ఉత్తరప్రదేశ్‌లో 8, ఉత్తరాఖండ్‌లో 5, పశ్చిమ బెంగాల్‌లో 3, అండమాన్ నికోబార్‌లో 1, జమ్మూ కాశ్మీర్‌లో 1, లక్షద్వీప్‌లో 1 పుదుచ్చేరిలో 1 లోక్‌సభ స్థానానికి మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయి.