AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈదురుగాలులకు ఎగిరిపోయిన చిన్నారి మృతి.. మెదక్‌ జిల్లాలో విషాదం

ఈదురుగాలులకు ఆరేండ్ల చిన్నారి బలైంది. రాష్ట్రంలో అకాల వర్షాలకు తోడు బలంగా వీస్తున్న సుడిగాలుల కారణంగా రేకులతో పాటు ఎగిరిపోయిన బాలిక.. తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ విషాద ఘటన మెదక్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట జాజితండాకు చెందిన మంజుల, మాన్సింగ్‌ దంపతులకు సంగీత, సీత (6) అనే కవలలు ఉన్నారు. అదే తండాలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నారు. సోమవారం తల్లిదండ్రులు ఇద్దరూ పొలం పనులకు వెళ్లగా.. ఇంట్లో నాన్నమ్మతో ఉన్న సంగీత, సీత రేకులకు ఉయ్యాల కట్టుకుని ఆడారు. ఆ తర్వాత కొద్దిసేపటికి నానమ్మ, సీత ఇద్దరూ పక్కింటికి వెళ్లారు. సంగీత మాత్రం ఇంట్లోనే ఉండి ఉయ్యాలలో ఆడుకుంటూ ఉంది.

అప్పుడే పెద్దగా గాలి దుమారం లేవడంతో ఇంటి రేకులతో పాటు ఉయ్యాలలో ఉన్న సంగీత ఎగిరిపోయి రెండు ఇండ్ల తర్వాత ఉన్న స్లాబ్‌పై పడింది. ఇది గమనించిన స్థానికులు గాయాలతో కొట్టుమిట్టాడుతున్న సంగీతను 108 అంబులెన్స్‌లో నర్సాపూర్‌ ఆస్పత్రికి తరలించారు. దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం సంగీత మృతి చెందింది. దీంతో జాజితండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ANN TOP 10