యాదగిరిగుట్టలో కింద కూర్చున్నారు అంటూ జరిగిన ట్రోల్ అంశంపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నాను అని భట్టి తేల్చి చెప్పారు. ఆ ఫోటోను తీసుకొని కావాలని కొందరు ట్రోల్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ”నేను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. ఆర్థికశాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నా. నేను ఎవరికీ తలవంచే వాడిని కాదు. ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
అసలేం జరిగిందంటే..
యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పీటలపై కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖకు మాత్రం కాస్త ఎత్తు తక్కువ ఉన్న పీటలు వేశారు. ఇది దుమారం రేపింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ వీడియోను షేర్ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. యాదాద్రీశుడి సాక్షిగా దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దీనిపై తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ వ్యవహారం దుమారం రేపడంతో.. దీనిపై భట్టి విక్రమార్క తాజాగా స్పందించారు. ఇందులో ఎలాంటి అవమానం లేదని, కావాలనే తాను చిన్న పీటపై కూర్చున్నానని భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు.