భద్రాద్రి కొత్తగూడం: బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ‘ప్రజాదీవెన’ సభలో ఆయన మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు మోసం చేసిందని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్..బీఆర్ఎస్, బీజేపీపార్టీలపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. అయితే, తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలేనని అన్నారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో తమను గెలిపించారని ధన్యవాదాలు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించామన్నారు. వీటి నిర్మాణానికి రూ. 22,500 కోట్లు కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు. ఇవాళ కేసీఆర్‌కు సూటిగా నేను సవాల్విసురుతున్నాను. డబుల్బెడ్రూం ఇచ్చినా, దళితులను ఆదుకున్నా అని చెప్పుకొచ్చిన కేసీఆర్.. నువ్వు ఎక్కడైతే సంక్షేమం అందించావో అక్కడే ఓట్లు అడగి వేయించుకోవాలి. ఏ ఊళ్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో అక్కడ మేము ఓట్లు అడుగుతాం. ఈ సవాల్‌కు సిద్ధమా? అని కేసీఆర్‌ను నేను అడుగుతున్నాను అని సీఎం రేవంత్ సవాల్ విసిరారు.
తమ పాలనలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం రేవంత్ కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రధాని చెప్పారన్న ఆయన.. ఆ పథకం ద్వారా తెలంగాణలో ఎక్కడ ఇళ్లు కట్టారో బీజేపీ చెప్పాలని డిమాండ్‌చేశారు. రైతుల సమస్య లు పరిష్కరించలేదని, నిరుద్యోగం పెరిగిపోయిందని రేవంత్ ఆరోపించారు. మోడీ, కేడీ కలిసి తమ ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామనుకోవద్దని రేవంత్ హెచ్చరించారు. అంతేగాక, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తన దగ్గరకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత తమదేనని చెబుతున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.