వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేర్చాం
రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు
భద్రాచలంలో సీఎం రేవంత్‌రెడ్డి
(అమ్మన్యూస్ ప్రతినిధి, భద్రాచలం):
భద్రాచలం రామయ్య సాక్షిగా ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. సోమవారం సీఎం రేవంత్ భద్రాచలంలో పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడూ మాట తప్పన దాఖళాలు లేవని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేసి చూపించామని చెప్పారు. ఇవాళ భద్రాచలం రాములోరి ఆశీర్వాదం తీసుకొని ప్రభుత్వ ప్రతిష్టాత్మకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ఆత్మగౌరవమే ఈ ఇందిరమ్మ ఇళ్లు అని అభిప్రాయపడ్డారు. పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. రూ.22,500 కోట్లతో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు.
కేసీఆర్‌కు సవాల్..
ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసురుతున్నానని, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే మేం ఓట్లు అడుగుతామని, మీరు ఏ ఊరిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారో ఆ ఊరిలోనే ఓట్లు అడగాలని అన్నారు. పేదలకు ఇండ్లు ఇస్తామన్న బీజేపీ.. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఇచ్చిందో చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఢల్లీిలో రైతులను బలి తీసుకున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని ఆరోపించారు.
ఇల్లాలి ఆనందంగా ఉంటే ఇల్లు బాగున్నట్లే..
ఇల్లాలి ముఖంలో ఆనందం ఉందంటే ఆ ఇల్లు బాగున్నట్లే అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంటి నిర్వహణ మహిళ చేతిలో ఉంటే ఇల్లు బాగుంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుమీదే ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూవమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశారని.. పేదల కలలతోని కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. అల్లుడొస్తే కాళ్లు గోడకు తాకొద్దని.. విశాలమైన ఇళ్లు ఇస్తామని మోసం చేశారని గుర్తుచేశారు. అందుకే కేసీఆర్ పాలనను బొందపెట్టి ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ కు ఒక బలమైన బంధం ఉందిని సీఎం అన్నారు. అందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం జిల్లాలో ప్రారంభించామన్నారు. మరోవైపు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాని సీఎం రేవంత్ పేర్కొన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సైతం అందిస్తున్నామని చెప్పారు.