AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్: నేడు మరోసారి అమిత్ షాతో కీలక భేటీ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన నిర్ణయించిన నేపథ్యంలో సీట్ల పంపకాలపై ఆ పార్టీ పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురువారం అర్ధరాత్రి వరకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. చర్చలు కొలిక్కి రాకపోవడంతో శుక్రవారం కూడా కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కావాలని నిర్ణయించారు.

అయితే, నేటి సమావేశం వాయిదా పడింది. అమిత్ షా, జేపీ నడ్డాలకు సమయం కుదరకపోవడంతో శుక్రవారం సమావేశమయ్యేందుకు సాధ్యపడలేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం సమావేశం కావాలని నిర్ణయించారు. అమిత్ షా శనివారం బీహార్ రాజధాని పాట్నా వెళ్లనుండగా.. ఆ పర్యటనకు ముందు కలిసేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా చంద్రబాబు, పవన్ ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది.

శనివారం నాటి భేటీలో బీజేపీకి ఇచ్చే సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు, లోక్‌సభ ఎన్నికల్లో పది సీట్లను బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ కోరుతున్న కీలక స్థానాలు కోరుతుండటంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

ANN TOP 10